మంచిర్యాల 34వ డివిజన్లో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు..
క్షేత్రస్థాయిలో మేయర్ పర్యవేక్షణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ అన్నారు. మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమంలో భాగంగా బుధవారం 34వ డివిజన్లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని
అన్ని డివిజన్లలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పేరుకుపోయిన చెత్త తొలగింపు, వీధి దీపాల ఏర్పాటు, మంచినీటి సరఫరా, సీసీ రోడ్ల మరమ్మతులు వేగవంతం చేసినట్లు వివరించారు. 34వ డివిజన్ సింగరేణి ప్రాంతం అయినప్పటికీ మున్సిపల్, సింగరేణి అధికారుల సమన్వయంతో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మధుకర్ పేర్కొన్నారు. ప్రజలు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా మున్సిపల్, సింగరేణి చెత్త తరలింపు వాహనాలను ఉపయోగించాలని సూచించారు. డివిజన్ అభివృద్ధికి స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు. పర్యటనలో భాగంగా ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారం కోసం సిబ్బందికి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, 34వ డివిజన్ కార్పొరేటర్ అగ్గు సాగర్, 33వ డివిజన్ కార్పొరేటర్ ఎంబడి కుమారస్వామి, 26వ డివిజన్ కార్పొరేటర్ ఇరగదుండ్ల రవి, 30వ డివిజన్ కార్పొరేటర్ కర్రె శ్రీనివాస్, మున్సిపల్, సింగరేణి అధికారులు, సిబ్బంది, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.







