చాకుంట గ్రామంలోని ఇద్దరు బాలురను దత్తత తీసుకున్న మర్రి మహేష్ రెడ్డి
కరీంనగర్, ఆర్.కె న్యూస్: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం చాకుంట గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన ఇద్దరు బాలురను కరీంనగర్ వన్ హాస్పిటల్ వైద్యుడు మర్రి మహేష్ రెడ్డి దత్తత తీసుకున్నారు. శుక్రవారం బాధితుల నివాసానికి చేరుకున్న ఆయన చిన్నారులకు పూర్తిస్థాయిలో విద్య, వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు. మానవతా దృక్పథంతో చిన్నారుల భవిష్యత్తు బాధ్యత స్వీకరించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాకుంట గ్రామానికి చెందిన ఐలవేణి తిరుపతి, లావణ్య దంపతులకు ఆదిత్య (12), శ్రీనివాస్ (9) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడేళ్ల క్రితం తల్లి లావణ్య కిడ్నీ వ్యాధితో మరణించారు. ఆరు రోజుల క్రితం తండ్రి తిరుపతి కూడా అనారోగ్యంతో హఠాన్మరణం చెందారు. దీంతో చిన్నారులు ఒక్కసారిగా అనాధలయ్యారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఈ బాలురకు రక్తసంబంధీకులు ఎవరూ లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఏకాకిలయ్యారు. చిన్నారుల దీనగాథను తెలుసుకున్న మర్రి మహేష్ రెడ్డి గ్రామంలోని బాలుర పూరింటికి వెళ్లి వారిని పరామర్శించారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వీరిద్దరికీ ఉన్నత చదువులు చెప్పించడంతో పాటు వైద్య అవసరాలను తానే చూసుకుంటానని వెల్లడించారు. తక్షణ అవసరాల కోసం చిన్నారులకు నగదు సాయం అందజేశారు. దైవ సమానమైన వృత్తిలో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని స్థానికులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పురం రాజేశం మాధవి, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, సురేష్, శంకర్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.







