సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన డీసీపీ.. రికార్డుల తనిఖీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వారికి సత్వర న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించాలని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశించారు. మంగళవారం మంచిర్యాల జోన్ పరిధిలోని సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, రౌడీ షీటర్ల వివరాలు, పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతిని క్షుణ్ణంగా పరిశీలించారు. అంతకుముందు స్టేషన్‌కు చేరుకున్న డీసీపీకి అధికారులు మొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు. పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు నిరంతరం నిర్వహిస్తూ విజిబుల్ పోలీసింగ్ చేపట్టాలని డీసీపీ సూచించారు. సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకం కావాలని, శాంతిభద్రతల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచి రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించాలని డీసీపీ స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని, నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విధి నిర్వహణలో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, ఎస్‌ఐ ఎం. ప్రశాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.







