జీఎం కార్యాలయంలో అధికారుల ఆసనాల సాధన.. యోగా శిక్షకుడు సాంబయ్యకు సత్కారం
నస్పూర్, ఆర్.కె న్యూస్: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల నేపథ్యంలో శనివారం శ్రీరాంపూర్ ఏరియా వ్యాప్తంగా అన్ని గనులు, కార్యాలయాలలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జనరల్ మేనేజర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ పాల్గొని అధికారులతో కలిసి ఆసనాలు సాధన చేశారు. ఫైనాన్స్ విభాగం సీనియర్ అసిస్టెంట్, యోగా శిక్షకుడు సాంబయ్య పర్యవేక్షణలో వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది యోగా సాధనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మునిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో యోగాను ఒక భాగంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి యోగా ఎంతో ప్రధానమన్నారు. మనదేశంలో పుట్టి నేడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న యోగాను మనం నిత్యం సాధన చేయాలని సూచించారు. ఆధునిక జిమ్‌లు, ఇతర మార్గాల కంటే యోగా ఎంతో సులువైనదని, విలువైనదని పేర్కొన్నారు. ఇంట్లోనే కొంత సమయం వెచ్చిస్తే మంచి ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. అనంతరం అందరితో యోగా సాధన చేయించిన యోగా శిక్షకుడు సాంబయ్యను జీఎం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటూ జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, అధికారుల సంఘం శ్రీరాంపూర్ అధ్యక్షులు కె. వెంకటేశ్వర్ రెడ్డి, ఏజీఎం ఫైనాన్స్ సుమలత, డీజీఎంలు ఎస్. అనిల్ కుమార్, రాజన్న, హరినారాయణ, ఆనంద్ కుమార్, ఏఎస్ఓ విజయ్ కుమార్, పర్చేజ్ ఆఫీసర్ చంద్రశేఖర్, కమ్యూనికేషన్ ఆఫీసర్ క్రాంతి కుమార్, ఇతర సిబ్బంది హాజరయ్యారు.







