- సింగరేణి వ్యాప్తంగా సీఎంఓఏఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు
- శ్రీరాంపూర్ దీక్షా శిబిరాన్ని సందర్శించి ఐఎన్టీయూసీ పూర్తి మద్దతు ప్రకటన
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి అభివృద్ధిలో అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నందున, వారికి రావాల్సిన న్యాయమైన పీఆర్పీ (పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే) ప్రయోజనాలను ఆలస్యం చేయకుండా వెంటనే అందించాలని తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ డాక్టర్ బి. జనక్ ప్రసాద్ డిమాండ్ చేశారు. సింగరేణి అధికారులకు సంబంధించిన పీఆర్పీ నిలుపుదలను వ్యతిరేకిస్తూ సింగరేణి వ్యాప్తంగా కోల్ మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ పూర్తి మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని కోరారు. అధికారుల పీఆర్పీ నిలుపుదల అంశాన్ని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు బి. జనక్ ప్రసాద్ వెల్లడించారు. అధికారులకు పీఆర్పీ చెల్లించేందుకు ఎలాంటి సాంకేతిక, పరిపాలన పరమైన ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. లాభాల సాధనలో నిరంతరం శ్రమిస్తున్న అధికారుల హక్కులను కాలరాయడం సరికాదన్నారు. యాజమాన్యం తక్షణమే స్పందించి నిలిపివేసిన నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు జెట్టి శంకర్ రావు, సెంట్రల్ నాయకులు కలవేన శ్యామ్, రిక్కల గోపాల్ రెడ్డి, ఏంబడి తిరుపతి, మహేందర్ రెడ్డి, చందు, మోహన్, రామకృష్ణ పాల్గొన్నారు.







