డ్రైనేజీల్లో నీటి మళ్లింపునకు చర్యలు.. అధికారులకు అప్రమత్తత ఆదేశాలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నీటి నిల్వలు ఏర్పడిన ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ బుధవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు.
వర్షపు నీరు నిలిచిపోయిన రహదారులు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీల పరిస్థితిని స్వయంగా తనిఖీ చేసి, నీటి పారుదల వేగవంతం అయ్యేలా తక్షణ చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.ముఖ్యంగా కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్ తిరుమల టౌన్‌షిప్, 32వ డివిజన్ రాంనగర్ ఆదిపరాశక్తి దేవాలయం వద్ద వాగులు, డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో, జేసీబీ సహాయంతో తక్షణమే పూడిక తొలగించి నీటిని సురక్షితంగా మళ్లించే ఏర్పాట్లు చేశారు.స్థానిక ప్రజల నుంచి సమస్యలపై సమాచారం అందగానే స్పందించిన మేయర్, స్వయంగా ఆయా డివిజన్లలో పర్యటిస్తూ మున్సిపల్ అధికారులను, పారిశుధ్య సిబ్బందిని అప్రమత్తం చేశారు. వర్షాకాలంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగిస్తూ డ్రైనేజీల్లో నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు నిరంతరం వేగవంతమైన సేవలు అందుబాటులో ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది, ఆయా డివిజన్ల ప్రజలు పాల్గొన్నారు.








