నస్పూర్, ఆర్.కె న్యూస్: బీఎంఎస్ రాష్ట్ర ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడిగా మంచిర్యాలకు చెందిన చెల్ల విక్రమ్ నియమితులయ్యారు. హైదరాబాద్లోని బీఎంఎస్ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో బీఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంచిర్యాల కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గాజుల ముకేశ్ గౌడ్, బీఎంఎస్ ఆటో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంతరం పెంటయ్యల చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. మంచిర్యాల జిల్లా బీఎంఎస్ అధ్యక్షుడిగా ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి విక్రమ్ చేసిన నిరంతర సేవలను గుర్తించి రాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా చెల్ల విక్రమ్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు, పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవితో తన బాధ్యత మరింత పెరిగిందని, ఆటో డ్రైవర్లు, కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు ఎల్లవేళలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
11







