అనుమతులు తప్పనిసరి.. డీజేలకు అనుమతి లేదు:మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: పోలీస్ నిబంధనలు పాటిస్తూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్ సూచించారు. మంగళవారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేష్ మండపాల నిర్వాహకులతో అవగాహన సమావేశం నిర్వహించారు. నిర్వాహకులు ముందుగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని పోలీస్ శాఖ నుంచి అధికారిక అనుమతి పత్రం తప్పనిసరిగా పొందాలని స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా విగ్రహాలు ప్రతిష్టించరాదని తెలిపారు. శాంతిభద్రతల దృష్ట్యా మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని, కేవలం భక్తి పాటలు మాత్రమే వేసుకోవాలని పేర్కొన్నారు. మద్యం సేవించడం, లక్కీ డ్రాలు నిర్వహించడం, రాజకీయ ప్రసంగాలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భద్రత కోసం ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో సీసీసీ నస్పూర్ ఎస్సై మేకల ప్రశాంత్, పోలీస్ సిబ్బంది, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.







