పీఎస్ రద్దు చేసి, మెరుగైన పీఆర్‌సీ అమలు చేయాలి
నస్పూర్‌లో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి డిమాండ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఒకటో తారీఖున వేతనాలు చెల్లించడం మినహా ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క ప్రధాన హామీని నెరవేర్చలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పి. శ్రీపాల్ రెడ్డి విమర్శించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలోని ఎంఎం గార్డెన్‌లో ఆదివారం పీఆర్‌టీయూటీఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం ఘనంగా జరిగింది. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొట్టె శంకర్, బచ్చ మోహన్ రావుల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డిలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఉద్యోగ జేఏసీకి ఇచ్చిన హామీ ప్రకారం డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్‌సీ నివేదికను తెప్పించుకుని మంచి ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలిత ఇతర రాష్ట్రాల్లో చేసినట్లుగానే తెలంగాణలోనూ సీపీఎస్ రద్దుకు కమిటీని వేసి త్వరితగతిన పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఏపీ తరహాలో 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తింపజేసేలా 57, 58 మెమోలను అమలు చేయాలన్నారు. కొత్త ఈహెచ్‌ఎస్ విధానం ఉద్యోగులకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదని, ప్రైవేట్ ఆసుపత్రులతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుని నగదు రహిత నాణ్యమైన చికిత్స అందించాలని పేర్కొన్నారు. సర్వశిక్షా అభియాన్, ఆశ్రమ పాఠశాలల సీఆర్పీలకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేయడంతో పాటు గత సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై శాసనమండలిలో నిరంతరం గళమెత్తుతానని స్పష్టం చేశారు. పీఆర్‌టీయూ పోరాటాలకు ఆకర్షితులై పలు సంఘాల ఉపాధ్యాయులు ఈ సందర్భంగా సంఘంలో చేరారు. అనంతరం పీఆర్‌టీయూటీఎస్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా కొట్టె శంకర్, ప్రధాన కార్యదర్శిగా బచ్చ మోహన్ రావు తిరిగి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు కొండ జనార్ధన్, మహిళా అధ్యక్షురాలు జనగామ ఉమాదేవి, అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








