• రూ. 40,300 నగదు, 3 సెల్ఫోన్లు, స్కూటీ స్వాధీనం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్డులో గల హరినిలయ విల్లాస్ వెనుక ప్రాంతంలో డబ్బులు పందెంగా పెట్టి అక్రమంగా పేకాట ఆడుతున్న స్థావరంపై బుధవారం సాయంత్రం పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నార్కోటిక్ టీమ్/టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సై లక్ష్మణ్ రావు, మంచిర్యాల టౌన్ పోలీసులతో కలిసి సంయుక్తంగా ఈ తనిఖీలు చేపట్టారు. దాడి సమయంలో జూదం ఆడుతున్న కత్రె గణేష్ (కాలేజ్ రోడ్), ఆరె రాజేష్ (రాంనగర్), పోలక మల్లేష్ (ఎన్టీఆర్ నగర్, మంచిర్యాల)లతో పాటు జమ్మికుంటకు చెందిన మహమ్మద్ అన్వర్ పాషాలను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 40,300 నగదు, 3 మొబైల్ ఫోన్లు మరియు ఒక స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నలుగురు నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తుతో సహా తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







