- ఆలయ పవిత్రత కాపాడడమే లక్ష్యం.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
దండేపల్లి, ఆర్.కె న్యూస్: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి ఆలయ పరిసరాల్లో మద్యం, మాంసాహార విక్రయాలపై అధికారులు బుధవారం కఠిన ఆంక్షలు విధించారు. క్షేత్రానికి ప్రతిరోజూ వందలాది మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతినకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. స్థానిక ఎస్సై తహిసోద్దీన్, ప్రభుత్వ అధికారులు కలిసి క్షేత్ర పరిసరాల్లోని దుకాణాలను స్వయంగా తనిఖీ చేసి నోటీసులు జారీ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం వద్ద నిబంధనలకు విరుద్ధంగా మాంసం, మద్యం విక్రయిస్తే సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని దుకాణదారులకు సూచించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా సహకరించాలని కోరారు.







