- శ్రీరాంపూర్ సీఐ అశోక్
- అంబేద్కర్ గ్రౌండ్‌లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని శ్రీరాంపూర్ సీఐ అశోక్ పిలుపునిచ్చారు. మంగళవారం నస్పూర్ మండలం శ్రీరాంపూర్ అంబేద్కర్ గ్రౌండ్‌లో స్థానిక అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. అనంతరం సింగరేణి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఒక పెను సమస్యగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని, హత్యల ద్వారా సంభవించే మరణాల కంటే రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యే అధికంగా ఉందని సీఐ వివరించారు. పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, వాహనదారులు తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి నిబంధనలు పాటించినప్పుడే ఈ ప్రమాదాలకు చెక్ పెట్టగలమని స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, మద్యం మత్తులో వాహనం నడపడం వల్ల తమకే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. అదేవిధంగా కారు నడిపే సమయంలో తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని మరియు చిన్న పిల్లలకు వాహనాలను ఇవ్వకూడదని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్, కార్పొరేటర్లు వేల్పుల రవీందర్, రాజేశ్వరి, సింగరేణి బీసీ ఉద్యోగుల సంఘం శ్రీరాంపూర్ బ్రాంచ్ సెక్రటరీ బరపటి మారుతి, తోకల సురేష్, అనపర్తి రాజేష్, పోలీస్ సిబ్బంది, అంబేద్కర్ సంఘం సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.







