అల్ఫోర్స్ అధినేత సేవలు స్ఫూర్తిదాయకం: ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెతుల రాజేంద్ర పాణి
నస్పూర్, ఆర్.కె న్యూస్: విద్యారంగంలో విశేష సేవలు అందిస్తూ ప్రతిష్టాత్మక ‘లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు సంపాదించిన ప్రముఖ విద్యావేత్త, అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ వి. నరేందర్ రెడ్డిని ట్రస్మా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కరీంనగర్‌లోని ఆయన కార్యాలయంలో బుధవారం ట్రస్మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెతుల రాజేంద్ర పాణి, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, ట్రస్మా ప్రతినిధులు నరేందర్ రెడ్డిని కలిసి శాలువా కప్పి, సత్కరించారు. ఈ సందర్భంగా రాజేంద్ర పాణి మాట్లాడుతూ.. డాక్టర్ నరేందర్ రెడ్డి విద్యార్థుల అభ్యున్నతి కోసం అహర్నిశలు చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఆయన ప్రవేశపెడుతున్న వినూత్న విద్యా విధానాలు ఇతర విద్యాసంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. అంతర్జాతీయ స్థాయిలో లండన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకోవడం విద్యా రంగానికే గర్వకారణమని హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ పురస్కారాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి కే. శ్యాంసుందర్ రెడ్డి, కోశాధికారి కృష్ణారెడ్డి, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ రేగళ్ల ఉపేందర్, ట్రస్మా ప్రతినిధులు శ్రీధర్ రెడ్డి, ఖాజా కమ్రోద్దీన్, కే. జగన్మోహన్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, జుల్ఫికర్, పాషా, అంబాల రాజ్‌కుమార్, అమన్ తదితరులు పాల్గొన్నారు.







