విద్యాభివృద్ధికి అందించిన సేవలను కొనియాడిన పర్యావరణవేత్త యోగేశ్వర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా తొలి విద్యాశాఖ అధికారి, రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ (ఎస్ఐఈటీ) ప్రొఫెసర్ కె. రవికాంతరావు విద్యా రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్ పేర్కొన్నారు. రవికాంతరావు ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా మంగళవారం జిల్లా కలెక్టరేట్లోని వయోజన విద్యా కార్యాలయానికి వచ్చిన ఆయనను యోగేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను పుష్పమాల, శాలువా, సన్మానపత్రంతో ఘనంగా సత్కరించి పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. మంచిర్యాల జిల్లా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో రవికాంతరావు విశిష్టమైన పాత్ర పోషించారని యోగేశ్వర్ తెలిపారు. ఆయన అందించిన ప్రోత్సాహం జీవితంలో మరువలేనిదని చెప్పారు. జిల్లాలోని విద్యా సంస్థల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇరువురి మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని వివరిస్తూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. పర్యావరణ రక్షణ కోసం యోగేశ్వర్ నిరంతరంగా చేస్తున్న సేవలను రవికాంతరావు ప్రత్యేకంగా అభినందించారు. ప్రకృతి మిత్ర సంస్థ ద్వారా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శనీయమని కొనియాడారు. భవిష్యత్తులో ఇదే ఉత్సాహంతో పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యావేత్తలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.







