7, 33వ డివిజన్లలో అమ్మవారిని దర్శించుకున్న మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: దుర్గామాత ఆశీస్సులతో మంచిర్యాల నగర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని, నగరం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్
ధర్ని మధుకర్ ఆకాంక్షించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 07వ డివిజన్ మరియు 33వ డివిజన్లలో ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవార్లను మంగళవారం ఆయన దర్శించుకున్నారు. కార్పొరేటర్లు ఎంబాడి కుమారస్వామి, వేల్పుల రవీందర్, తాళ్ల సంపత్ రెడ్డిలతో కలిసి మేయర్ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్ మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలు భక్తిభావాన్ని, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించడమే కాకుండా ప్రజల మధ్య ఐక్యతను, పరస్పర సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబంపై జగన్మాత చల్లని చూపు ఉండాలని కోరుకుంటూ ఉత్సవ నిర్వాహకులకు, భక్తులకు, డివిజన్ ప్రజలకు దేవీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. పూజా కార్యక్రమాల అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మేయర్‌ను, కార్పొరేటర్లను శాలువాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు, కాలనీ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








