ఎస్ఆర్పీ-1 గనిలో ఘనంగా చండీ హోమం, అన్నదానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: జగన్మాత దుర్గాదేవి చల్లని ఆశీస్సులతో ఎస్ఆర్పీ-1 గనిలో రక్షణతో కూడిన ఉత్పత్తి, ఉత్పాదకత సాధించి, గని జీవితకాలం మరిన్ని రోజులు పెరగాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ఆకాంక్షించారు. శ్రీరాంపూర్ ఏరియా వ్యాప్తంగా అన్ని గనులు, విభాగాలు, కార్యాలయాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఎస్ఆర్పీ-1 గని ఆవరణలోని అమ్మవారి ఆలయంలో శాంతి చండీ హోమం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీఎం మునిగంటి శ్రీనివాస్ హోమంలో పాల్గొని దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఉద్యోగులంతా క్షేమంగా ఉంటూ ఉత్పత్తి లక్ష్యాలను చేరుకోవాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ హోమం, పూజా కార్యక్రమాల్లో గని అధికారులు, కార్మికులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రటరీ బాజీ సైదా, బెల్లంపల్లి రీజియన్ జీఎం (సేఫ్టీ) రఘుకుమార్, జీఎం (క్వాలిటీ) వీరభద్రరావు, గని మేనేజర్ ఆత్మారాం సహాని, ఇతర యూనియన్ల నాయకులు, అధికారులు, ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.







