జనసేన సమన్వయకర్త చుంచు రాజ్‌కిరణ్
మంచిర్యాల కలెక్టరేట్ వద్ద ఎన్హెచ్ఎం ధర్నా
నస్పూర్, ఆర్.కె న్యూస్: వైద్యారోగ్య శాఖలో ఎన్నో ఏళ్లుగా కీలక సేవలందిస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పరిధిలోని 17,000 మంది ఉద్యోగులను ఎలాంటి షరతులు లేకుండా వెంటనే రెగ్యులరైజ్ చేయాలని జనసేన పార్టీ పెద్దపల్లి,
ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ చుంచు రాజ్‌కిరణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చుంచు రాజ్‌కిరణ్ మాట్లాడుతూ.. ఎన్హెచ్ఎంలోని 78 విభాగాలకు చెందిన ఉద్యోగులు చేస్తున్న న్యాయమైన పోరాటంపై ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించి పరిష్కరించాలన్నారు. రెగ్యులరైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు సమాన పనికి సమాన వేతనం వర్తింపజేయడంతో పాటు పీఆర్సీ, డీఏ, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) హెల్త్ కార్డులు తదితర ప్రయోజనాలను కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ఎన్హెచ్ఎం జేఏసీ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ గౌరీ శంకర్, తెలంగాణ రాష్ట్ర ఎన్హెచ్ఎం జేఏసీ కో-ఆర్డినేటర్ డి. వినోద్, ప్రవళిక (డీడీఎం), రాజు, మధుబాబు (పీహెచ్ఎం అడ్వైజర్), వివిధ విభాగాల ఎన్హెచ్ఎం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.








