నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ లోని శ్రీ రెయిన్ బో పాఠశాల యాజమాన్యానికి పాఠశాల పూర్వ విద్యార్థులు సావిత్రిబాయి పూలే చిత్రపటాన్ని గురువారం బహుకరించారు. పూర్వ విద్యార్థులైన ఆధ్యాన్ష్ హయాన్, అనంత్ విహాన్ తమ తండ్రి యుగేందర్ సాయితో కలిసి ఈ చిత్రపటాన్ని పాఠశాల డైరెక్టర్ అమన్ ప్రసాద్, ఉపాధ్యాయులకు అందజేశారు. తమ పిల్లలు మంచిర్యాల కార్మెల్ కాన్వెంట్ (సీబీఎస్ఈ) స్కూల్‌లో చేరిన సందర్భంగా, ఇన్నాళ్లూ తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి వారి అభివృద్ధికి కృషి చేసినందుకు కృతజ్ఞతగా ఈ బహుమతిని అందించినట్లు యుగేందర్ సాయి తెలిపారు. భారతదేశ చరిత్రలో విద్య ద్వారా చైతన్యం తెచ్చిన సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే పోరాటం, త్యాగాలు ఎనలేనివని ఈ సందర్భంగా యుగేందర్ సాయి పేర్కొన్నారు. నేటి సమాజంలో విద్యాభివృద్ధికి వారు వేసిన మొదటి అడుగులే నేడు మనకు పాఠశాలల రూపంలో కనిపిస్తున్నాయన్నారు. ఆ మహనీయుల ఆశయాలకు ప్రతీకగా తమ పిల్లలతో కలిసి పాఠశాల డైరెక్టర్‌కు, ఉపాధ్యాయ బృందానికి ఈ చిత్రపటాన్ని అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
30







