శాంతి స్టేడియంలో ఆదివారం ఘనంగా ఫ్యామిలీ డే – బతుకమ్మ సంబరాలు
అధికారులతో జీఎం మునిగంటి శ్రీనివాస్ సమీక్ష
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు సింగరేణి యాజమాన్యం ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న ఫ్యామిలీ డే, బతుకమ్మ ఆట-పాటల వేడుకల నిర్వహణపై గురువారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో అధికారులతో ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు. కృష్ణ కాలనీలోని శాంతి స్టేడియం వేదికగా ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఆడపడుచుల పండుగ బతుకమ్మను కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీరాంపూర్ పరిసర ప్రాంతాల నుంచి మహిళలు, ఉద్యోగుల కుటుంబాలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నందున స్టేడియంలో వేదిక, విద్యుత్ దీపాలు, సౌండ్ సిస్టం, పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకు ఉత్తమ బతుకమ్మతో పాటు, ముందుగా వేదిక వద్దకు చేరుకున్న వారికి ప్రత్యేక బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, ఏరియా ఇంజనీర్ ఎస్. సురేష్, ఆర్.కె గ్రూప్ ఏజెంట్ ఎన్. శ్రీధర్, ఎస్సార్పీ గ్రూప్ ఏజెంట్ రవికుమార్, సివిల్ హెచ్ఓడీ రవికుమార్, డీజీఎం (వర్క్షాప్) కృష్ణారెడ్డి, డీవై పీఎం క్రాంతి కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.







