అగ్ని ప్రమాదాలతో పర్యావరణానికి ముప్పు: ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: మానవ తప్పిదాల వల్ల అడవుల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ప్లాంటేషన్లకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీ ఎఫ్ డీసీ) మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జైపూర్ మండలం ముదిగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని నీలగిరి ప్లాంటేషన్ లో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన వివరించారు. ముఖ్యంగా వేసవికాలంలో మానవ నిర్లక్ష్యం వల్లనే అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయని సురేష్ కుమార్ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల కారణంగా చెట్లు ఎండిపోవడమే కాకుండా ఎన్నో జీవరాశులు మృత్యువాత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడవుల్లో బీడీలు, సిగరెట్లు తాగి నిర్లక్ష్యంగా పడేయవద్దని కోరారు. స్వార్థ ప్రయోజనాల కోసం నిప్పు పెట్టడం వల్ల పర్యావరణానికి తీరని హాని కలుగుతుందని హెచ్చరించారు. అడవులు మానవాళి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు ఎంతో తోడ్పడుతున్నాయని ఆయన తెలిపారు. అడవులను, ప్లాంటేషన్లను కాపాడడానికి కృషి చేస్తున్న అటవీ శాఖ సిబ్బందికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. పర్యావరణాన్ని రక్షించుకోవడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టి జి ఎఫ్ డి సి సిబ్బంది రాజేష్, శంకర్, సంజీవ్ పాల్గొన్నారు.







