- సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) జనరల్ సెక్రటరీ తుమ్మల రాజారెడ్డి
- ఆర్.కె-5 గనిపై సీఐటీయూ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉద్యోగాలు ఇవ్వలేక కార్మిక సంఘాలను బదనాం చేసే పద్ధతి మానుకోవాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) జనరల్ సెక్రటరీ తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె-5 గనిపై నిర్వహించిన గేట్ మీటింగ్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అసెంబ్లీ వేదికగా కార్మిక సమస్యలను పరిష్కరించాల్సింది పోయి సంఘాల ఫిర్యాదు వల్లే మెడికల్ బోర్డు ఆపామని చెప్పడం సరికాదని విమర్శించారు. యువ కార్మికుల వల్ల సంస్థ ఆర్థికంగా నష్టపోతుందనే వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ నెలలోనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, మెడికల్ దందాలో ఉన్న నాయకులు, అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. గనులలో స్థానిక సమస్యలు పెరిగిపోతున్నాయని డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్ ఆరోపించారు. కార్మికులకు డ్రిల్ బిట్లు, నాణ్యమైన డ్రిల్ రాడ్లు, గ్లౌజులు, ఇతర పనిముట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పని స్థలాల్లో కనీసం తాగునీటి వసతి కూడా కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిచిన సంఘాల నాయకులు గనుల్లోకి దిగి పనిచేయకపోవడం వల్లే ఈ సమస్యలు పేరుకుపోయాయని విమర్శించారు. కార్మిక వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందులను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కార్మిక సంఘాల పట్ల ఒకే విధంగా ఉందని రాజారెడ్డి విమర్శించారు. ఏఐటీయూసీ నాయకులు పెద్దన్న పాత్ర పోషించి అన్ని సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై పోరాడాలని సూచించారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఎనర్జీ సెక్టార్‌ను ఏకం చేసి నిరవధిక సమ్మె చేయడానికి జాతీయ స్థాయిలో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. సోషల్ మీడియాలో విమర్శలు చేసే నాయకుల పట్ల కార్మికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ నాయకులు శ్రీనివాస్, చిగురు లక్ష్మణ్, బట్టు సురేందర్, పోతు వెంకటేష్, తోట విజయ్ సహా పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.







