సచివాలయంలో కలిసిన ఏడు జిల్లాల నూతన కలెక్టర్లు
హైదరాబాద్, ఆర్.కె న్యూస్: జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ జిల్లాలకు కొత్తగా నియమితులైన కలెక్టర్లు మంగళవారం సచివాలయంలో రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలనను ప్రజల వద్దకు చేర్చాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం గత రెండేళ్లుగా పేదల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి అందేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని మంత్రి స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం సమతూకంతో సాగాలని ఆకాంక్షించారు. నిర్ణయాలు తీసుకునే సమయంలో మానవీయ కోణంలో ఆలోచించాలని అధికారులకు హితవు పలికారు.
అట్టడుగు స్థాయి ప్రజలతో నిరంతరం మమేకం కావాలని అధికారులకు సూచించారు. పాలనలో సమన్వయం పాటిస్తూ పారదర్శకంగా పనిచేయాలని కోరారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి ప్రజల ఆశయాల సాధనకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు.







