బీజేపీ అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలి
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించకుండా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాసిరెడ్డి సీతారామయ్య డిమాండ్ చేశారు. రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా బుధవారం నస్పూర్ మండల కేంద్రంలోని షిర్కే సెంటర్‌లో నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ చేస్తున్న అబద్ధపు విషప్రచారాలకు తెరదించాలని ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన మహత్తర పోరాటంలో కమ్యూనిస్టులు ముందుండి ప్రజలను సమీకరించారని సీతారామయ్య గుర్తుచేశారు. భూమి, భుక్తి, వెట్టిచాకిరీ విముక్తి, సామాజిక న్యాయం కోసం వేలాది మంది కమ్యూనిస్టులు, రైతులు, సామాన్య ప్రజలు ప్రాణత్యాగాలు చేశారని కొనియాడారు. చరిత్రను వక్రీకరిస్తూ ఆ పోరాటంలో అగ్రభాగాన నిలిచిన కమ్యూనిస్టుల త్యాగాలను మరుగునపర్చాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వాస్తవ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజా ఉద్యమాల చరిత్రను కించపరిచే కుట్రలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మేకల దాస్, రేగుంట చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు దాగం మల్లేష్, కారుకూరి నగేష్, కే. వీరభద్రయ్య, నస్పూర్ మండల కార్యదర్శి గోగుల మల్లయ్య, జోగుల మల్లయ్య, కార్యదర్శి లింగం రవి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ముష్కే సమ్మయ్య, మిర్యాల రాజేశ్వరరావు, కొట్టే కిషన్ రావు, దొడ్డిపట్ల రవీందర్, ఇలవేణి సారంగపాణి, పూజారి రామన్న, కొత్తపల్లి మహేష్, మండల నాయకులు ఆంజనేయులు, బొడ్డు లక్ష్మణ్, సురేష్, పోషం, నర్సింగరావు, రాజయ్య, రాకేష్, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.







