రామకృష్ణపూర్ సింగరేణి ఆసుపత్రిలో రోగులను పరామర్శించిన ఏఐటీయూసీ నాయకులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: కార్మికుల ఆరోగ్య పరిరక్షణను సంస్థ ప్రధాన బాధ్యతగా భావించి సింగరేణి యాజమాన్యం పనిచేయాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముస్కే సమ్మయ్య, శ్రీరాంపూర్ బ్రాంచ్ సెక్రటరీ ఎస్కే బాజీ సైదా డిమాండ్ చేశారు. రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని బుధవారం ఏఐటీయూసీ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా వివిధ గనుల్లో జరిగిన ప్రమాదాల్లో గాయపడిన కార్మికులను, అనారోగ్యంతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కార్మికులకు ధైర్యం చెబుతూ సమస్యల పరిష్కారానికి గుర్తింపు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చికిత్స పొందుతున్న కార్మికులకు అవసరమైన అన్ని వైద్య సేవలు సమయానికి అందేలా చూడాలని ఆసుపత్రి యాజమాన్యాన్ని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన కార్మికులను ఆలస్యం చేయకుండా మెరుగైన చికిత్స కోసం కార్పొరేట్ ఆసుపత్రులకు వెంటనే రిఫర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్మికుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో మందులు, టాబ్లెట్లు, ఇతర వైద్య సదుపాయాల కొరత లేకుండా నిరంతరం అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. బాధితులకు అవసరమైన సేవలు అందించేందుకు ఆసుపత్రిలో సిబ్బందిని, మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ బ్రాంచ్ నాయకులు, వివిధ గనుల ప్రతినిధులు, కార్మికులు పాల్గొన్నారు.




