- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
- ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రోత్సాహక బహుమతులు అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థలోనే శ్రీరాంపూర్ ఏరియా పర్సనల్ విభాగం ఉద్యోగుల పనితీరు అత్యంత అభినందనీయంగా ఉందని ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ కొనియాడారు. డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్ పర్యవేక్షణలో వివిధ విధుల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన డీవైపీఎం జీకే. కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ ఆకుల అఖిలను బుధవారం జీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఉద్యోగుల టెర్మినల్ బెనిఫిట్స్, సీపీఆర్ఎంఎస్ కార్డుల మంజూరు, బదిలీలు, పదోన్నతులు, క్వార్టర్ల కేటాయింపు వంటి సంక్షేమ కార్యక్రమాల్లో ఈ విభాగం ముందువరుసలో నిలిచిందని పేర్కొన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వివరాల నమోదు సేవల విషయంలో పర్సనల్ విభాగం వేగంగా స్పందిస్తోందని జీఎం తెలిపారు. ముఖ్యంగా కార్మికుల గైర్హాజరుపై క్రమశిక్షణ చర్యలు, అప్పీళ్ల పరిష్కారాన్ని త్వరితగతిన పూర్తి చేస్తూ కంపెనీ వ్యాప్తంగా అన్ని ఏరియాల కంటే శ్రీరాంపూర్ ముందంజలో నిలిచి ఏరియాకు మంచి గుర్తింపు తీసుకువచ్చిందని అభినందించారు. బహుమతులు అందుకున్న వారిని ఆదర్శంగా తీసుకొని పర్సనల్ విభాగంలోని ఇతర అధికారులు, సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతీ ఒక్కరు సమయపాలన పాటిస్తూ సంస్థలో శ్రీరాంపూర్ ఏరియాకు మరింత ప్రతిష్ట తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, డీవై పీఎం కిరణ్, సీనియర్ పీఓలు మురళి, ప్రశాంత్, సురేందర్, పర్సనల్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








