నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి పెన్షనర్ల వైద్య, ఇతర సమస్యల పరిష్కారానికి సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించింది. బుధవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో డైరెక్టర్ (పా) గౌతమ్ పొట్రుతో భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) అనుబంధ సింగరేణి పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సీఎంపీఎఫ్ ట్రస్ట్ బోర్డు సభ్యులు కొత్తకాపు లక్ష్మారెడ్డి, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం. రమాకాంత్, అడ్వైజర్ పులి రాజరెడ్డి పెన్షనర్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సీపీఆర్ఎంఎస్ కార్డులు లేని మాజీ కార్మికులకు కూడా సింగరేణి ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందించేందుకు డైరెక్టర్ సానుకూలత వ్యక్తం చేశారు. సింగరేణి ఆసుపత్రులలో పెన్షనర్ల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. పెన్షనర్లకు ప్రతి మూడు నెలలకు ఒకసారి మందులు ఇవ్వాలని, మెడికల్ బిల్లుల రీయంబర్స్ మెంట్ను 45 రోజుల్లోగా పూర్తి చేయాలని నాయకులు కోరారు. పెన్షనర్లు నివసిస్తున్న ప్రాంతాలకు సమీపంలోని మెడికల్ షాపుల ద్వారా మందులు పొందే సౌకర్యం కల్పించాలని, ప్రతి సభ్యునికి వార్షిక వైద్య ఖర్చుల నిమిత్తం ₹25,000 కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఆర్ఎంఎస్ పరిమితిని రూ. 8 లక్షల నుండి రూ. 15 లక్షలకు పెంచాలని, వైద్యం పొందిన ప్రతిసారీ ఫోన్కు ఎస్ఎంఎస్ పంపాలని కోరారు. ఈ డిమాండ్లపై సానుకూలంగా స్పందించిన డైరెక్టర్ గౌతమ్ పొట్రు, సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
5







