స్టేషన్లో వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశం
నస్పూర్, ఆర్.కె న్యూస్: రోడ్డు భద్రత, ప్రయాణికుల రక్షణ దృష్ట్యా సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సేవలందిస్తున్న రాపిడో బైక్ రైడర్లకు పోలీస్ శాఖ పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపిడో డ్రైవర్లందరూ వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు హాజరై తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని పోలీసులు ఆదేశించారు. ప్రతి రైడర్ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహన ఆర్సీ, ఇన్సూరెన్స్ వంటి కీలక పత్రాలను వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. ప్రయాణ సమయంలో రైడర్‌తో పాటు వెనుక కూర్చునే ప్రయాణికుడు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని తేల్చిచెప్పారు. ముఖ్యంగా ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మెలగాలని, మహిళా ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఎలాంటి అసభ్య ప్రవర్తనకు తావివ్వరాదని సూచించారు. ప్రయాణాల సమయంలో ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాధారణ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రతే తమ ప్రథమ కర్తవ్యమని, ప్రమాదాల నివారణకు, సురక్షిత ప్రయాణానికి ప్రతి ఒక్కరూ పోలీసు శాఖకు సహకరించాలని నస్పూర్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.



