సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి: ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు
ఏఐటీయూసీలో చేరిన మంచిర్యాల డిపో డ్రైవర్లు, కండక్టర్లు
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: తెలంగాణ ఆర్టీసీ అభివృద్ధిలో అహర్నిశలు శ్రమిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లకు ప్రభుత్వం తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించాలి” అని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల దాసు డిమాండ్ చేశారు. మంచిర్యాల ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న పలువురు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లు, కండక్టర్లు ఏఐటీయూసీ కార్మిక సంఘంలో చేరారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు వారికి ఎర్ర కండువాలు కప్పి సాదరంగా సంఘంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మేకల దాసు మాట్లాడుతూ.. ఆర్టీసీలో చాలీచాలని వేతనాలతో తీవ్రమైన పని ఒత్తిడిని భరిస్తూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. సమయానికి వేతనాలు అందక, ఉద్యోగ భద్రత లేక వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ‘సమాన పనికి సమాన వేతనం’ చెల్లించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ సదుపాయాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాల ప్రకారం కల్పించాల్సిన అన్ని హక్కులు, సౌకర్యాలను యాజమాన్యం వెంటనే అమలు చేయాలన్నారు. కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ నిరంతరం అండగా ఉండి పోరాడుతుందని, కార్మికులంతా ఐక్యంగా పోరాడి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రీజినల్ అధ్యక్షుడు మామిడిపల్లి శ్రీనివాస్, డిపో కార్యదర్శి గోలి శంకర్, నాయకులు శంకరాచారి, అంజయ్య, సర్వర్ పాషా, రాజు, భారతి, సుమలత, పానుగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.







