నస్పూర్ తహసీల్దార్‌కు 4వ డివిజన్ కార్పొరేటర్ వినతి
నస్పూర్ ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ ఆర్.కె 6 గుడిసెల ప్రాంత నివాసితులకు జీవో నెం. 76 ద్వారా వెంటనే ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని స్థానిక కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నస్పూర్ మండల తహసీల్దార్‌కు ఆయన లిఖితపూర్వక వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గుమ్మడి శ్రీనివాస్ మాట్లాడుతూ… ఆర్.కె 6 గుడిసెల ప్రాంతంలో నిరుపేద ప్రజలు కొన్ని దశాబ్దాలుగా నివాసముంటున్నారని తెలిపారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో ఇండ్ల నంబర్ల మార్పులు చేర్పులు జరగకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే జీవిస్తున్న అర్హులైన నిరుపేద కుటుంబాలకు జీవో 76 కింద రెగ్యులరైజ్ చేసి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలని, అలాగే ఇంటి నంబర్ల సమస్యను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. తహసీల్దార్ సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.





