మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్ రావు
37వ డివిజన్‌లో నూతన ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: పేద ప్రజల దశాబ్దాల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యంమని మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్‌సాగర్ రావు పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37వ డివిజన్‌కు చెందిన నక్క లావణ్య – మహేష్ దంపతులు రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహకారంతో నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశంలో భాగంగా నిర్వహించిన దీపావళి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులైన లావణ్య – మహేష్ దంపతులకు నూతన వస్త్రాలు అందజేసి, కుటుంబ సభ్యులతో కలిసి టపాసులు కాల్చి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం సురేఖమ్మ మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంగా సొంత గూడు లేక ఎన్నో ఇబ్బందులు పడిన పేద కుటుంబానికి నేడు ఇందిరమ్మ పథకం ద్వారా పక్కా ఇల్లు సమకూరడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు. కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇంట్లో పేద ప్రజల ఆనందాల మధ్య దీపావళి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. నిరుపేదల ముఖాల్లో చిరునవ్వులు పూయించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో పేదరిక నిర్మూలన దిశగా సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, స్థానిక 37వ డివిజన్ కార్పొరేటర్ ఖలీద్, పలువురు కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.








