నస్పూర్, ఆర్.కె న్యూస్: వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమ్మెకు తెలంగాణ రక్షణ సేన మంచిర్యాల జిల్లా శాఖ సంపూర్ణ సంఘీభావం ప్రకటించింది. తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గత 30 రోజులుగా ఉద్యోగులు శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షా శిబిరాన్ని తెలంగాణ రక్షణ సేన నాయకులు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ చంద్రమోహన్ గౌడ్ ఉదారి మాట్లాడుతూ… గత రెండు దశాబ్దాలుగా ప్రజారోగ్య పరిరక్షణలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు కీలకపాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. చాలీచాలని వేతనాలతో ఏళ్ల తరబడి సేవలందిస్తున్న వీరి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి తక్షణమే ఉద్యోగ భద్రత కల్పించి క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి తిప్పారపు సారయ్య మాట్లాడుతూ… ఉద్యోగుల హక్కుల సాధన కోసం సాగుతున్న ఈ న్యాయమైన పోరాటానికి తెలంగాణ రక్షణ సేన ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు హారిక రావు, రాష్ట్ర మహిళా నాయకురాలు నిషా, జిల్లా సంయుక్త కార్యదర్శులు రాచకొండ సురేష్, లెనిన్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సంధ్య, అధికార ప్రతినిధి శ్రీవాణి, కాసిపేట మండల అధ్యక్షుడు సురేష్, నాయకులు జహీర్ ఖాన్, రజిత, రాజశేఖర్, ప్రశాంత్, జ్యోతి, వసంత తదితరులు పాల్గొన్నారు.
12 November 2026
నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
సోన్, ఆర్.కె న్యూస్: అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు అందించడంతో పాటు, లబ్ధిదారులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం సోన్ మండలంలోని సంగెంపేట్ గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్, రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇళ్లకు అవసరమైన అన్ని సదుపాయాలను త్వరితగతిన కల్పించాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత నిర్మించాలని, తద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసి భూగర్భ జలాల సంరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. అనంతరం గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అవసరమైన సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అలాగే జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరూ విబిజి రామ్ జీ పథకం ద్వారా ఉపాధి హామీ పనులు పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంతోష్, ఎంపీడీవో రామకృష్ణ, హౌసింగ్ డీఈ గంగాధర్, సర్పంచ్ మారి విలాస్, మొయినుద్దీన్, ఇతర అధికారులు, సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.



