- ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ ఉచిత విద్య అమలు చేయాలి
- టీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్
బెల్లంపల్లి, ఆర్.కె న్యూస్: ఇంటర్మీడియట్ విద్యా బోర్డును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలంటే విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించాలని సూచించారు. పదో తరగతి తర్వాత 40 శాతం డ్రాప్అవుట్లు ఉన్నాయన్న ప్రభుత్వ ప్రకటనపై స్పష్టత ఇవ్వాలని, ఏ గణాంకాల ఆధారంగా ఈ లెక్కలు చెబుతున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లోనే మౌలిక సదుపాయాల కొరత ఉందని, ఇంటర్మీడియట్ను విలీనం చేస్తే అవసరమైన అధ్యాపకులు, ల్యాబ్లు, ఇతర వసతులు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ఈ నిర్ణయం గ్రామీణ విద్యార్థులపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో మార్పుల వల్ల కార్పొరేట్ విద్యాసంస్థల ప్రభావం పెరిగే ప్రమాదం ఉందని, ఐఐటీ, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ప్రత్యేక బోధన ఎలా అందిస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల విద్యా ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. అందువల్ల ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ ఉచిత విద్య అమలు చేసి, విద్యార్థుల ఫీజుల భారాన్ని ప్రభుత్వమే భరించాలని, ఇందుకోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని సిద్ధంశెట్టి సాజన్ కోరారు.



