మెడికల్ బోర్డు నిలిపివేతపై ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు సరికావు: సిఐటియు నేత అల్లి రాజేందర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: కార్మిక సంఘాలను బదనాం చేసే విధానాలు మానుకోవాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్ డిమాండ్ చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూటెక్ గనిలో శుక్రవారం ట్రామర్, లైన్ మెన్, సపోర్ట్ మెన్ కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పిట్ సెక్రటరీ పెరుక సదానందంతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో రాజేందర్ మాట్లాడారు. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మెడికల్ బోర్డు నిలిపివేతకు కార్మిక సంఘాల ఫిర్యాదులే కారణమని చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
మెడికల్ బోర్డు ఇన్వాలిడేషన్ల వల్ల కొత్త నియామకాలు జరిగి సంస్థపై ఆర్థిక భారం పడుతుందని చెబుతున్న ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వం నుండి సింగరేణికి రావాల్సిన బకాయిల చెల్లింపుపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గత ఎన్నికల సమయంలో మెడికల్ బోర్డు ఆపమని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి, ఇప్పుడు గెలిచిన తర్వాత మాట మార్చడం కార్మికుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని సూచిస్తోందని విమర్శించారు. మెడికల్ బోర్డులో జరిగిన అవినీతికి కారణమైన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమైందో సమాధానం చెప్పాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లేబర్ కోడ్ ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు కేంద్రం మాదిరిగానే ఉందని రాజేందర్ విమర్శించారు. కేరళ తరహాలో లేబర్ కోడ్ లను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ అంతర్యం ఏమిటని నిలదీశారు. నైనీ ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు గొప్పలు చెప్పుకున్న వారు, ఇప్పుడు అందులోని అవకతవకలకు బాధ్యులెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిపై సంఘాలు ముందుగానే హెచ్చరించినా పట్టించుకోకుండా, ఇప్పుడు వాటిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సరికాదన్నారు. పది నెలలుగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు.
ఐటీ మాఫీ, వేజ్ బోర్డు ఒప్పందాల అమలు విషయంలో ఏఐటియుసి అనుసరిస్తున్న విధానాలను ఆయన తప్పుబట్టారు. గత ఏడాది కాలంగా ఒప్పందాలు అమలు కాకపోతే అన్ని సంఘాలను కలుపుకొని పోరాడాల్సింది పోయి, ఇప్పుడు ఒంటరిగా ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ఏఐటియుసి పెద్దన్న పాత్ర పోషించి, అన్ని సంఘాలను కలుపుకొని సమ్మె నోటీసు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కస్తూరి చంద్రశేఖర్, అల్వాల అభిలాష్, లింగమూర్తి, పోలు సంపత్, రమేష్ పాల్గొన్నారు.







