వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా వేడుకలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. రామనవమి సందర్భంగా శుక్రవారం ఉదయం 11 గంటల 5 నిమిషాలకు పునర్వసు నక్షత్రయుక్త అభిజిత్ లగ్న సుముహూర్తాన ఈ వేడుకను నిర్వహించారు. శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవం వైభవంగా సాగింది. మునిగంటి శ్రీనివాస్ – ఉమారాణి దంపతులు తమ నివాసం నుండి మంగళ వాయిద్యాల నడుమ తలంబ్రాలతో కళ్యాణ ప్రాంగణానికి చేరుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. వేదపండితుల
మంత్రోచ్చారణల మధ్య నియమ నిష్టలతో జరిగిన ఈ కార్యక్రమంలో దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో భక్తులు భారీగా పాల్గొని రామనామ స్మరణతో తరించారు. వేసవి తాపం దృష్ట్యా భక్తుల కోసం మజ్జిగ సౌకర్యం కల్పించారు. సీతారాముల కళ్యాణం అనంతరం పానకంతో పాటు అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని జీఎం దంపతులతో పాటు రాంపూర్ ఏరియా అధికారులు స్వీకరించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, స్థానికులు ఈ కళ్యాణాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, ఏజీఎం (ఫైనాన్స్) సుమలత, ఐకే ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, ఎస్సార్పీ ఓసీ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిప్ప వెంకటేశ్వర్లు, క్వాలిటీ మేనేజర్ వెంకటేశ్వర రెడ్డి, డీజీఎం దామోదర్, న్యూటెక్ గని మేనేజర్ కూరపాటి శ్రీనివాస్, సీనియర్ పీఓ సురేందర్, సీనియర్ ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







