జూన్ 2న టీ రన్, సాంస్కృతిక ప్రదర్శనలు.. ఉత్తమ ఉద్యోగులకు సత్కారం
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జూన్ 2న శ్రీరాంపూర్ ఏరియా పరిధిలో నిర్వహించనున్నట్లు ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ 2న ఉదయం 8 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడంతో వేడుకలు ప్రారంభమవుతాయి. అక్కడ నుంచి షిర్కె, సిసిసి, శ్రీరాంపూర్ మీదుగా జీఎం కార్యాలయం వరకు బతుకమ్మలు, ఒగ్గుడోలు, పోతరాజులు, తెలంగాణ ధూం ధాం కళాకారుల ప్రదర్శనలతో భారీ టీ-రన్, ర్యాలీ నిర్వహిస్తారు. జీఎం కార్యాలయం వద్ద ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం కార్యాలయ ప్రాంగణంలో జీఎం చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటల నుంచి శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతి స్టేడియంలో విద్యార్థులు, సేవా సభ్యులు, సింగరేణి కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన ఉత్తమ ఉద్యోగులను ఈ వేదికపై సత్కరించనున్నారు. ప్రగతి స్టేడియం ప్రాంగణంలో సింగరేణి సంస్థకు చెందిన రెస్క్యూ, మెడికల్, ఫారెస్ట్, మైన్స్, సేవా సమితి, కమ్యూనికేషన్ విభాగాల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. వివిధ రకాల తినుబండారాల స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునే వారు జీఎం కార్యాలయం పర్సనల్ విభాగంలో సంప్రదించాలని కోరారు.







