వాల్టా అథారిటీ సభ్యులు గుండేటి యోగేశ్వర్
నస్పూర్‌లో ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో కాలుష్య రహిత దీపావళిపై అవగాహన
నస్పూర్, ఆర్.కె న్యూస్: దీపావళి అంటే నూనెతో వెలిగించే దివ్య దీపాల వరుస మాత్రమే.. అంతేకానీ కాలుష్యాన్ని వెదజల్లే బాంబుల వరుస కాదని రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ వాల్టా అథారిటీ సభ్యులు, ప్రకృతి మిత్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్ పేర్కొన్నారు. ప్రకృతి మిత్ర తెలంగాణ ఆధ్వర్యంలో శుక్రవారం నస్పూర్ కలెక్టరేట్ రోడ్డులోని రాష్ట్ర కార్యాలయ ఆవరణలో కాలుష్య రహిత దీపావళి నిర్వహణపై విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పర్యావరణహిత మట్టి ప్రమిదలను, ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం హాజరైన వారందరితో కాలుష్య రహిత దీపావళి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా గుండేటి యోగేశ్వర్ మాట్లాడుతూ.. ప్రజలంతా ప్రకృతికి, మూగజీవాలకు హాని కలిగించని మట్టి దీపాలను వెలిగించి ఆనందంగా పండుగను జరుపుకోవాలన్నారు. టపాసుల నుంచి వెలువడే పొగ వల్ల గర్భిణులు, వృద్ధులు, చిన్నారులతో పాటు పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాయు, శబ్ద కాలుష్యాల వల్ల గుండె, నరాలు, శ్వాసకోశ, కంటి, చర్మ సంబంధిత వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. రాజ్యాంగం, పర్యావరణ చట్టాలను గౌరవిస్తూ విషపూరిత బాణసంచాను స్వచ్ఛందంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అగ్నిమాపక, అటవీ శాఖ అధికారులు సత్యనారాయణ, రమేష్ బాబు, సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. గాలి, శబ్ద కాలుష్యాలకు కారణమయ్యే బాణసంచాకు దూరంగా ఉండాలని, తప్పనిసరి పరిస్థితుల్లో కేవలం గ్రీన్ టపాసులను మాత్రమే పరిమితంగా కాల్చాలన్నారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే 101 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు. సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రకృతి మిత్ర బృందాన్ని వారు అభినందించారు. అనంతరం పలువురు మహిళలు మాట్లాడుతూ.. బాంబులు, రసాయన టపాసులు కాల్చకుండా దీప కాంతులతో కేదారేశ్వరి అమ్మవారిని పూజించి సంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత వ్యవసాయ అధికారి కస్తూరి నాగేశ్వర్, మహిళా ప్రతినిధులు రాచకొండ చందన, చిప్ప జ్యోతి, స్వర్ణలత, హేమ, కలెక్టరేట్ ఏరియా, ఒమాక్స్ విల్లా కాలనీల వాసులు ఉషారాణి, పుష్ప, మమత, విజయ, అనిత, రజిత, ప్రకృతి మిత్ర సభ్యులు పాల్గొన్నారు.








