ట్రెక్కింగ్ ద్వారా వృక్షజాతులు, పక్షులను పరిశీలించిన అటవీ అభివృద్ధి సంస్థ సిబ్బంది
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న పర్యావరణ అవగాహన ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్‌డీసీ) ఆధ్వర్యంలో సోమవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండల అటవీ ప్రాంతంలో ‘అరణ్యదర్శిని’ కార్యక్రమం నిర్వహించారు. జూన్ 1 నుండి 12 వరకు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకొని సిబ్బందికి పర్యావరణంపై విస్తృత అవగాహన కల్పించారు. తెల్లవారుజాము నుంచి సుమారు నాలుగు గంటల పాటు అటవీ ప్రాంతంలో కాలినడకన తిరుగుతూ, కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేస్తూ వృక్షజాతులను, పక్షుల జీవన విధానాన్ని సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా టీజీఎఫ్‌డీసీ డివిజనల్ మేనేజర్ గణేష్ మాట్లాడుతూ, అడవుల్లో లభించే స్వచ్ఛమైన ప్రాణవాయువు మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. విధి నిర్వహణ సమయంలో సిబ్బంది రోజులో కొద్దిసేపు అటవీ వాతావరణంలో ధ్యానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి, వివిధ ఆరోగ్య రుగ్మతలు తొలగిపోతాయని వివరించారు. ప్రకృతి, అడవుల సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ రేంజ్‌లకు చెందిన ప్లాంటేషన్ మేనేజర్లు గోగు సురేష్ కుమార్, జలపతి, లక్ష్మణ్ తో పాటు ఫీల్డ్ సూపర్‌వైజర్లు, ప్లాంటేషన్ వాచర్లు, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.








