ఇళ్లకు వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చిన మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
నస్పూర్, ఆర్.కె న్యూస్: పాత నేరస్తులు తమ ప్రవర్తన మార్చుకొని సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని, లేనిపక్షంలో వారిపై రౌడీషీట్లు తెరవాల్సి వస్తుందని మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గోపతి రవీందర్ హెచ్చరించారు. శుక్రవారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలువురు పాత నేరస్తుల ఇళ్లకు ఆయన స్వయంగా వెళ్లి వారి ప్రస్తుత జీవన విధానం, ప్రవర్తనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఐ గోపతి రవీందర్ వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తూ.. గతంలో నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని ఇకపై ఎలాంటి నేర, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పాత నేరస్తుల కదలికలపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందని, ప్రవర్తనలో మార్పు రాకుండా తిరిగి నేరాల బాట పడితే వారి వివరాలను పరిశీలించి రౌడీషీట్లు తెరవడంతో పాటు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీసీసీ నస్పూర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.







