- గుర్తింపు సంఘం జీఎం చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య
- శ్రీరాంపూర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌కు గుర్తింపు సంఘం వినతిపత్రం సమర్పణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లో విధులు నిర్వహిస్తున్న వే బ్రిడ్జ్, క్లరికల్ సిబ్బంది ఎదుర్కొంటున్న వివిధ దీర్ఘకాలిక సమస్యలను యాజమాన్యం తక్షణమే పరిష్కరించాలని గుర్తింపు సంఘం (ఏఐటీయూసీ) జీఎం చర్చల ప్రతినిధి బద్రి బుచ్చయ్య డిమాండ్ చేశారు. బుధవారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిహెచ్. వెంకటేశ్వర్లును కలిసి కార్మికుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బద్రి బుచ్చయ్య మాట్లాడుతూ, ఓసీపీ వే బ్రిడ్జ్‌లో పనిచేస్తున్న క్లర్కులకు పని భారం దృష్ట్యా ఇన్సెంటివ్ కల్పించాలని, రెండు దశాబ్దాల క్రితం నాటి వే బ్రిడ్జ్‌ను సురక్షిత ప్రదేశానికి మార్చాలని కోరారు. కార్యాలయం, సర్వే విభాగ సిబ్బందికి పార్కింగ్, క్లరికల్ సిబ్బందికి ఫర్నిచర్ ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ అంతరాయం కలగకుండా ఇన్వర్టర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని బద్రి బుచ్చయ్య కోరారు. ముఖ్యంగా డీజీఎంఎస్ మార్గదర్శకాలు, మైన్స్ యాక్ట్ నిబంధనలకు అనుగుణంగా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై ప్రాజెక్ట్ ఆఫీసర్ సిహెచ్. వెంకటేశ్వర్లు సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను పరిశీలించి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ పిట్ సెక్రటరీ మోతె లచ్చన్న, సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి, శ్రీరాంపూర్ ఓసీపీ క్లరికల్ ఇన్‌చార్జ్ రమేష్, సత్యనారాయణ, మహిళా ప్రతినిధి సరోజ, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.







