అధికారుల సమస్యలపై అసెంబ్లీలో పోరాడుతాం.. ఉపముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సీఎంఓఏఐ కేంద్ర కమిటీ పిలుపు మేరకు పే అప్గ్రేడేషన్, పీఆర్పీ బకాయిల చెల్లింపు తదితర న్యాయమైన డిమాండ్ల సాధనకై సింగరేణి అధికారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి మూడవ రోజుకు చేరాయి. శ్రీరాంపూర్ ఏరియాలోని అధికారుల దీక్షా శిబిరాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సందర్శించి తమ సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. సింగరేణి అధికారులు గత మూడు రోజులుగా శాంతియుతంగా దీక్షలు చేస్తున్నప్పటికీ, సింగరేణి సంస్థ పరిధిలోని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందించకపోవడం అత్యంత దారుణమన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో అధికారులకు ఇలాంటి దుస్థితి రాలేదని గుర్తుచేశారు. సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన, సంస్థ ఉనికిని కాపాడుకోవడానికి అధికారులు, ఉద్యోగులు కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. అధికారుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గళమెత్తుతామని హామీ ఇచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాలో బుధవారం జరిగిన దీక్షలో ఐకే-1ఏ మేనేజర్ కోటయ్య, ఆర్ అండ్ డీ మేనేజర్ అమర్నాథ్, సీనియర్ పీఓలు సంతన్, ఓంకారి బాబు, అరుణ్, రామాచారి, డీవై ఎస్ఈ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. యాజమాన్యం, ప్రభుత్వం నుండి డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చే వరకు వెనక్కి తగ్గేదే లేదని అధికారులు స్పష్టం చేశారు. జూలై 13 వరకు కొనసాగే ఈ రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని, ప్రతి ఒక్క అధికారి ఇందులో భాగస్వాములు కావాలని సీఎంఓఏఐ ప్రతినిధులు కోరారు.



