- పోలీస్ అమరవీరుల సంస్మరణార్థం విద్యార్థులకు అవగాహన
- పోలీసుల విధులు, ఆయుధాల పనితీరును వివరించిన ఎస్సై ఎండీ తహసీనుద్దీన్
నస్పూర్, ఆర్.కె న్యూస్: విధుల నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం సీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్‌లో స్థానిక బ్రిలియంట్ హైస్కూల్ విద్యార్థులతో పోలీస్ స్టేషన్ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీసీ నస్పూర్ ఎస్సై ఎండీ తహసీనుద్దీన్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పనితీరు, రోజువారీ విధులపై సమగ్రంగా అవగాహన కల్పించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ బాధ్యతలు, సిబ్బంది విధులు, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర, నేరాల నియంత్రణ విధానాల గురించి వివరించారు. అలాగే పోలీస్ స్టేషన్‌లో అందుబాటులో ఉండే వివిధ రకాల ఆయుధాల పనితీరు, వాటి వినియోగాన్ని విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి వారి సందేహాలను నివృత్తి చేశారు. సమాజ రక్షణలో పోలీసులు అందిస్తున్న సేవలను విద్యార్థులు గౌరవించాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.







