శ్రీరాంపూర్ జడ్పీ హైస్కూల్‌లో అల్పాహార పంపిణీ ప్రారంభించిన మంచిర్యాల మేయర్ ధర్ని మధుకర్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడి, విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావం చూపుతుందని మంచిర్యాల
నగర మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31వ డివిజన్ శ్రీరాంపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హరే కృష్ణ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ తాళ్ళ సంపత్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ప్రత్యేక చొరవ ఫలితంగా నియోజకవర్గంలో రాష్ట్రంలోనే నాలుగో సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు కావడం హర్షణీయమని మేయర్ తెలిపారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యార్థుల శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి, హరే కృష్ణ ఫౌండేషన్‌కు, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.







