- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
- ప్రమాదంలో కాళ్లు కోల్పోయిన కార్మికుడికి కోటి రూపాయల చెక్కు పంపిణీ
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి ప్రమాద బీమా బాధిత కుటుంబాలకే కాదు ప్రమాదవశాత్తు శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి సైతం ఆర్థికంగా భరోసా కల్పిస్తోందని శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని జీఎం కార్యాలయంలో 2024 మార్చిలో జరిగిన గని ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన ఎస్సార్పీ 1 కార్మికుడు సాదం సత్యనారాయణకు కోటి రూపాయల బీమా చెక్కును అందజేశారు. యూనియన్ బ్యాంక్ అధికారులతో కలిసి నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జాతీయ బ్యాంకుల్లో జీతం ఖాతా కలిగి ఉన్న ఉద్యోగులకు కోటి నుండి కోటి పాతిక లక్షల రూపాయల వరకు ఉచిత ప్రమాద బీమా అందుతోందని వివరించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి సంస్థలు మరణంతో పాటు వైకల్యానికి సైతం భారీ నష్టపరిహారం ఇస్తున్నాయని తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఈ సదుపాయం కల్పిస్తోంది. బీమా దరఖాస్తు ప్రక్రియలో ఆలస్యం జరిగినా యూనియన్ బ్యాంక్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని కోటి రూపాయలు మంజూరు చేయించడం అభినందనీయమన్నారు. ఈ ఆర్థిక సాయం సత్యనారాయణ కుటుంబానికి భవిష్యత్తులో ఎంతో ఆసరాగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఉద్యోగులందరూ యాజమాన్యం కల్పిస్తున్న ఈ ఉచిత బీమా పథకంపై అవగాహన పెంచుకోవాలని కోరారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ హెడ్ అపర్ణ రెడ్డి మాట్లాడుతూ ఏటీఎం కార్డు కలిగి ఉండటం ద్వారా మరో పది లక్షల రూపాయల అదనపు బీమా లభిస్తుందని చెప్పారు. బ్యాంక్ ఇన్సూరెన్స్ కవరేజీని కోటి పాతిక లక్షల రూపాయలకు పెంచినట్లు జోనల్ హెడ్ రవీంద్ర బాబు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం సత్యనారాయణ, గుర్తింపు సంఘం ప్రతినిధి కొమురయ్య, ఏజీఎం సుమలత, అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, డీజీఎం అనిల్ కుమార్, పీఓలు సురేందర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.







