- భూగర్భ గనుల్లో రికార్డు స్థాయి ప్రగతి.. వర్షాకాలానికి పక్కా ప్రణాళికలు
- జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: జూన్ మాసంలో 80 శాతం గ్రేడ్ సాటిస్ఫాక్షన్‌తో క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి విషయంలో సింగరేణి సంస్థలోనే శ్రీరాంపూర్ ఏరియా ప్రథమ స్థానంలో నిలిచిందని ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ వెల్లడించారు. సోమవారం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియా జూన్ నెల ఉత్పత్తి లక్ష్యం 4,06,500 టన్నులకు గాను 3,39,151 టన్నులు సాధించినట్లు తెలిపారు. ఇందులో భూగర్భ గనులు రికార్డు స్థాయిలో ఓవరాల్‌గా 96 శాతం ఉత్పత్తి సాధించాయని, ఎస్‌ఆర్‌పీ 1 గని అత్యధికంగా 122 శాతం ప్రగతి కనబరిచిందని పేర్కొన్నారు. ఉపరితల గనులకు సంబంధించి జూన్ మాసంలో 2,25,577 టన్నుల ఉత్పత్తి సాధించినట్లు మునిగంటి శ్రీనివాస్ చెప్పారు. ఎస్‌ఆర్‌పీ ఓసీలో రెండో కాంట్రాక్టు ప్రారంభం కావడం, ఇందారం ఓసీలో కొత్త కాంట్రాక్ట్ ఒప్పందం పూర్తి కావడంతో రానున్న రోజుల్లో ఉత్పత్తి మరింత పెరగనుందన్నారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి యాజమాన్యం నిర్దేశించిన 64 లక్షల 30 వేల టన్నుల వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని ముందస్తు ప్రణాళికలతో అధిగమిస్తామన్నారు. వర్షాకాలం నేపథ్యంలో గనుల్లో పంపింగ్ వ్యవస్థ, రక్షణ చర్యలు పూర్తి చేశామని వెల్లడించారు. ఏరియాలో ఇప్పటివరకు 3,856 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించామని, విరమణ పొందిన 9,766 మందికి మెడికల్ కార్డులు అందజేశామని వివరించారు. ఈ సమావేశంలో డీజీఎం (పర్సనల్) ఎస్. అనిల్ కుమార్, డీజీఎం (ఐఈడీ) రాజన్న, డీవై పీఎం క్రాంతి కుమార్ పాల్గొన్నారు.







