నస్పూర్, ఆర్.కెన్యూస్: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిగా హెచ్ఎమ్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పారపు సారయ్య నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత సోమవారం రాత్రి ప్రకటించిన 9 మంది పార్లమెంట్ ఇన్చార్జిల జాబితాలో సారయ్యకు స్థానం లభించింది. ప్రస్తుతం హెచ్ఎమ్ఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న సారయ్య, 1985లో విద్యార్థి ఉద్యమాల ద్వారా ప్రజా రంగంలోకి వచ్చారు. 1989లో సింగరేణి సంస్థలో ఉద్యోగిగా చేరినప్పటి నుంచి కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడారు. 1995 నుండి వర్తమానం, కోల్ వాయిస్, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ పత్రికల్లో విలేకరిగా కూడా సేవలందించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2006లో తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం స్థాపనలో క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా, 2007లో ప్రజాయుద్ధ నౌక గద్దర్తో కలిసి బొగ్గుబాయి టు బొగ్గుబాయి ప్రచారాన్ని విజయవంతంగా నిర్వహించారు. టీజేఏసీ, తెలంగాణ ప్రజా ఫ్రంట్ వేదికల ద్వారా తెలంగాణ భావజాల వ్యాప్తికి విశేష కృషి చేసిన ఆయన, ప్రస్తుతం పార్టీ బలోపేతంలో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
28 July 2026
- జెన్కో ద్వారా టెండర్ల ప్రక్రియ వల్ల సింగరేణి ఆర్థిక ప్రయోజనాలకు తీవ్ర గండి
- జెండాలు, రాజకీయాలు పక్కనపెట్టి యూనియన్లన్నీ ఐక్యపోరాటానికి రావాలి
- సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ అధ్యక్షులు అప్పాని శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కెన్యూస్: మణుగూరు పీకే ఓసీ డీప్ ప్రాజెక్టును సింగరేణికి దక్కకుండా జెన్కో ద్వారా టెండర్ల ప్రక్రియ చేపట్టడం వల్ల సింగరేణి సంస్థ ఆర్థిక ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) అధ్యక్షులు అప్పాని శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కార్మికులు, కార్మిక సంఘాలు, యాజమాన్యం ఏకగ్రీవంగా కోరుతున్నప్పటికీ, జెన్కోను పోటీలో నిలిపి టెండర్ల ప్రక్రియ నిర్వహించడం సరికాదన్నారు. ఇది తాడిచర్ల-1 తరహాలో కాంట్రాక్టర్లకు లాభం చేకూర్చేందుకే జరుగుతున్న ప్రయత్నమని ఆరోపించారు. మణుగూరు పీకే ఓసీ డీప్ ప్రాజెక్టు సింగరేణికి దక్కితే మణుగూరు ప్రాంతానికి మరో 35 సంవత్సరాల పాటు ఉపాధి, ఉత్పత్తి, ప్రాంతీయ అభివృద్ధికి తిరుగులేని భరోసా లభిస్తుందని అప్పాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. సంస్థ ప్రయోజనాలు, కార్మికుల భవిష్యత్తు ముడిపడి ఉన్న ఈ అంశంలో అన్ని కార్మిక సంఘాలు తమ జెండాలను, రాజకీయ భేదాలను పక్కనపెట్టి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. సింగరేణి భవిష్యత్తు కోసం బీఎంఎస్ ఐక్యపోరాటానికి పిలుపునిస్తోందని చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడుకుందాం, కార్మికుల భవిష్యత్తును రక్షించుకుందాం అని అప్పాని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. సంస్థ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వ విధానాలపై కార్మికులందరూ ఐక్యంగా తమ గళాన్ని వినిపించాలని, మణుగూరు పీకే ఓసీ డీప్ ప్రాజెక్టును సాధించుకునే వరకు పోరాటాన్ని కొనసాగించాలని ఆయన కోరారు.



