బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగునూరి వెంకటేశ్వర్ గౌడ్
సీసీసీ టౌన్షిప్లో ఘనంగా అంగన్వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: చిన్నారుల ఆరోగ్య పరిరక్షణతో పాటు సమాజ వికాసంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు అందిస్తున్న సేవలు ఎనలేనివని బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదినం, ఆయన ప్రజాజీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా నస్పూర్ మండల కేంద్రంలోని సీసీసీ టౌన్షిప్లో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ, ఆశా కార్యకర్తలను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా సేవకు ప్రతీకగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా పక్షోత్సవాలను చేపడుతున్నామని వివరించారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 7 వరకు దేశవ్యాప్తంగా అంగన్వాడీ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు చిన్నారుల ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుందని, పసిపిల్లలకు పోషకాహారం, ప్రాథమిక విద్యనందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో అంగన్వాడీలు తల్లిలాంటి పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. ఇంటి వద్ద తల్లిదండ్రులు ఎంతటి ప్రేమతో చూసుకుంటారో, అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ప్రతి చిన్నారిని అంతే ఆప్యాయతతో సంరక్షిస్తున్న కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని అన్నారు. గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణలోనూ అంగన్వాడీ కేంద్రాల సేవలు కీలకమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కన్వీనర్ పట్టి వెంకటకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు కమలాకర్ రావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పచ్చ స్వప్న, శ్రీరాంపూర్ జోన్ మహిళా మోర్చా అధ్యక్షురాలు రేణుక, సేవా సంకల్ప్ అభియాన్ కో-కన్వీనర్ బొంగోని శిరీష, నాయకులు స్వరూపరాణి, సృజన, శ్రీరాంపూర్ జోన్ అధ్యక్షులు సత్రం రమేష్, ప్రధాన కార్యదర్శులు పొన్నవేని సదయ్య, బద్రి శ్రీకాంత్, నాయకులు సామ్రాజ రమేష్, బొజ్జ నర్సయ్య, సత్యనారాయణ, బుద్దె రవి, తేజు, మహిళా ప్రతినిధులు స్వరూప, రూప, సుకన్య తదితరులు పాల్గొన్నారు.








