- శ్రీ వాసుదేవాయ హెల్త్ కేర్ ట్రస్ట్, నిర్మల పాలిక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ
- పెద్ద సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకున్న గ్రామస్తులు
మంచిర్యాల ప్రతినిధి, ఆర్.కె న్యూస్: హాజీపూర్ మండలంలోని దొనబండ గ్రామంలో స్థానిక ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వాసుదేవాయ హెల్త్ కేర్ ట్రస్ట్ సౌజన్యంతో, నిర్మల పాలిక్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామ సర్పంచ్ బేతు రమాదేవి రవి సహకారం అందించగా, దాతలు గుత్తికొండ ప్రశాంత్, మంగళిపల్లి రాజేష్ ఆర్థిక సహకారంతో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు జరిపి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్ విభాగాలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి, కుటుంబ ఆరోగ్య సలహాలను అందించారు. ప్రముఖ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ జి. శ్రీకాంత్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, తగిన ఆరోగ్య సూచనలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ… వర్షాకాలం నేపథ్యంలో విష జ్వరాలు, ఫైలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా దోమల నియంత్రణ, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ముందస్తు ఆరోగ్య పరీక్షలు, నిరంతర జాగ్రత్తలతోనే పలు దీర్ఘకాలిక వ్యాధులను నివారించవచ్చని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.




