- జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశ్విని కుమార్
- అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా నౌండ్ల సంతోష్ చారి నియామకం
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రాష్ట్రంలో నౌండ్ల సంతోష్ చారి నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి చెంది సమాజానికి విస్తృత సేవలు అందించాలని ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ అశ్విని కుమార్ ఆకాంక్షించారు. 1968లో స్థాపించబడి గత 58 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ మహాసభ తెలంగాణ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా నౌండ్ల సంతోష్ చారిని నియమించింది. ఈ మేరకు జాతీయ నాయకుల బృందం రాంచి నుండి హైదరాబాద్‌కు విచ్చేసి సంతోష్ చారికి నియామక పత్రాన్ని అధికారికంగా అందజేసింది. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సమాజం అభివృద్ధి కోసం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ సంఘం కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసం గత కొన్ని నెలలుగా కసరత్తు చేసింది. గత అధ్యక్షుడి పదవీకాలం ముగియడంతో అనేక మంది అభ్యర్థులను పరిశీలించినట్లు నిర్వాహకులు తెలిపారు. సంతోష్ చారికి ఉన్న నిజాయితీ, సంఘ కార్యక్రమాల్లో ఆయన ప్రదర్శిస్తున్న చురుకుదనం, సమాజంతో ఉన్న బలమైన అనుబంధాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలు అప్పగించినట్లు జాతీయ నాయకత్వం స్పష్టం చేసింది. మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన సంతోష్ చారి నియామకం పట్ల సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విశ్వకర్మల సంక్షేమం కోసం మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ నియామక కార్యక్రమంలో జాతీయ నాయకులు, రాష్ట్ర స్థాయి ప్రతినిధులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు.







