నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆఫీస్ బాయ్‌గా విధులు నిర్వహిస్తున్న హబీబ్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణతో కలిసి గురువారం నిమ్స్‌కు వెళ్లి హబీబ్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న మేయర్, మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మేయర్ వెంట మంచిర్యాలకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
1 October 2026
సెప్టెంబర్‌లో 99 శాతం లక్ష్య సాధన.. వార్షిక లక్ష్యాన్ని అధిగమిస్తాం
శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియా బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత పరంగా సెప్టెంబర్ మాసంలో అత్యుత్తమ ఫలితాలు సాధించిందని ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం శ్రీరాంపూర్ జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియాలోని మూడు భూగర్భ గనులు, ఒక ఓపెన్ కాస్ట్ నిర్దేశిత లక్ష్యాలను అధిగమించి వంద శాతానికి పైగా బొగ్గు ఉత్పత్తిని నమోదు చేశాయని హర్షం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి శ్రీరాంపూర్ ఏరియా మొత్తం ఉత్పత్తి లక్ష్యం 4,10,000 టన్నులు కాగా, 4,07,215 టన్నుల బొగ్గు వెలికితీసి 99 శాతం రికార్డు సాధించినట్లు తెలిపారు. భూగర్భ గనులలో ఎస్సార్పీ-1 గని 106 శాతం, ఆర్.కె-7 గని 101 శాతం, ఆర్.కె న్యూటెక్ గని 107 శాతం ఉత్పత్తి సాధించాయని పేర్కొన్నారు. మొత్తం భూగర్భ గనుల లక్ష్యం 1,20,000 టన్నులకు గాను 1,14,470 టన్నులతో 95 శాతం ఉత్పత్తి నమోదైందన్నారు. అలాగే ఉపరితల గనుల్లో ఎస్సార్పీ ఓసీపీ 114 శాతం ఉత్పత్తిని కనబరచగా, ఐకే ఓసీలో కొత్త కాంట్రాక్ట్ ప్రారంభమై 44 శాతం ఉత్పత్తి నమోదైందని తెలిపారు. మొత్తంగా ఓసీపీలలో 2,90,000 టన్నుల లక్ష్యానికి గాను 2,92,745 టన్నులతో 101 శాతం సాధించడం అభినందనీయమన్నారు. మిగిలిన ఆరు నెలల కాలంలో భూగర్భ, ఉపరితల గనుల్లో రక్షణతో కూడిన ఉత్పత్తిని మరింత పెంచి, సంస్థ వార్షిక నిర్దేశిత లక్ష్యాన్ని నూటికి నూరు శాతం అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. శ్రీరాంపూర్ ఏరియాలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని జీఎం వివరించారు. మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా ఇప్పటివరకు 3,868 మంది కార్మికుల వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. మరో 320 మంది ఉద్యోగులకు ఎల్ఎస్పీ, 14 మందికి ఎంఎంసీ చెల్లింపులు పూర్తి చేశామన్నారు. ఉద్యోగ విరమణ పొందిన 9,795 మంది విశ్రాంత ఉద్యోగులకు సీపీఆర్ఎంఎస్ పథకం కింద మెడికల్ కార్డులను అందజేసినట్లు జీఎం వెల్లడించారు.

రోడ్డు భద్రత, ఇంజినీరింగ్ లోపాలపై క్షేత్రస్థాయి సమీక్ష
నస్పూర్, ఆర్.కె న్యూస్: నస్పూర్ గేట్ వద్ద జాతీయ రహదారి-63పై ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని మంచిర్యాల రూరల్ సీఐ గోపతి రవీందర్, ఎన్‌హెచ్-63 సైట్ ఇంజినీర్ వినోద్ కుమార్, సీసీసీ నస్పూర్ ఎస్సై ఎండీ తహిసీనుద్దీన్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గత నెల 28న ఐదుగురు మహిళల ప్రాణాలు బలిగొన్న ప్రమాద తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఘటన జరిగిన ప్రాంతంలో రోడ్డు నిర్మాణ సంబంధిత ఇంజినీరింగ్ లోపాలు, డివైడర్ల అమరిక, రహదారి పరిస్థితులను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి రోడ్డు ప్రమాదాలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన ముందస్తు రక్షణ చర్యలు, రోడ్డు భద్రతా నిబంధనల అమలు, ప్రమాదకర మలుపులు, డివైడర్ల ఖాళీల నియంత్రణపై ఎన్హెచ్ఏఐ అధికారులతో చర్చించారు. త్వరలోనే అవసరమైన మరమ్మతులు, నిర్మాణాత్మక మార్పులు చేపట్టి రహదారిని ప్రమాద రహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.

సోన్, ఆర్.కె న్యూస్: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ వైద్యులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ గురువారం సోన్ తహసీల్దార్ సంతోష్‌కు గ్రామీణ వైద్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ వైద్యుల సంఘం సోన్ మండల అధ్యక్షుడు పత్తి రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా గ్రామీణ వైద్యులకు సర్టిఫికెట్లు జారీ చేయాలని, వారికి తగిన జీవనభృతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలు గ్రామాల ఆర్ఎంపీ వైద్యుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.



