- శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్
- ఎస్సార్పీ 3 గనిలో ఉత్పత్తి తీరుతెన్నుల పరిశీలన
- వచ్చే ఆర్థిక సంవత్సర లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం
నస్పూర్, ఆర్.కె న్యూస్: రక్షణతో కూడిన ఉత్పత్తి లక్ష్యాల కోసం ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. గురువారం ఉదయం ఆయన ఎస్సార్పీ 3 గనిని సందర్శించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో ఇప్పటి వరకు సాధించిన ఉత్పత్తి, ఉత్పాదకతలపై సమీక్ష నిర్వహించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. త్రీ సీమ్ లోని ఎస్ పి 3 ప్యానెల్ పని ప్రదేశాలలో ఉత్పత్తి తీరుతెన్నులను ఆయన స్వయంగా పరిశీలించారు. ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న చోట వర్కింగ్ కండీషన్స్ తనిఖీ చేశారు. మరో ఐదు రోజుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియనుంది. సంస్థ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించేలా ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని మునిగంటి శ్రీనివాస్ అధికారులను కోరారు. నూతన పని ప్రదేశాల అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పనుల అనుమతుల్లో ఎలాంటి జాప్యం లేకుండా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆదేశించారు. కొత్తగా అభివృద్ధి చేయాల్సిన పని ప్రదేశాలు, వాటికి అవసరమైన అనుమతులు, అనుసరించాల్సిన వ్యూహాలపై అధికారులకు స్పష్టత ఇచ్చారు. అంతకుముందు గని మేనేజర్ కార్యాలయంలో గ్రూప్ ఏజెంట్, గని మేనేజర్, సర్వేయర్లతో కలిసి ప్రస్తుత పని ప్రదేశాల చార్ట్స్ పరిశీలించారు. ఈ ఏడాది సాధించిన ఉత్పత్తి, ఓఎంఎస్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అవసరమైన పనిముట్లు, మెటీరియల్స్ ముందుగానే సేకరించుకోవాలని సూచించారు. మెరుగైన ఓఎంఎస్తో రక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉత్పత్తి పెంచేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పీ గ్రూప్ ఏజెంట్ జి. రవికుమార్, గని మేనేజర్ సిహెచ్. వెంకట్ రావు, సర్వేయర్ సుధాకర్ పాల్గొన్నారు.







